వారితో పోటీపడలేకపోతున్నాం, విద్యావ్యవస్థ ముఖచిత్రం మారాలి: మంత్రి శ్రీధర్ బాబు

పాఠశాల విద్య ముఖచిత్రాన్ని సమూలంగా మార్చాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు.

By Knakam Karthik
Published on : 3 March 2025 6:39 PM IST

Telangana, Education News, IT Minister SridharBabu, Review On Education Reforms

వారితో పోటీపడలేకపోతున్నాం, విద్యావ్యవస్థ ముఖచిత్రం మారాలి: మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా పాఠశాల విద్య ముఖచిత్రాన్ని సమూలంగా మార్చాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణాతో పాటు ఇతర ఉన్నతాధికారులతో విద్యా సంస్కరణలపై సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ప్రపంచానికి ప్రతిభావంతులను అందించిన ప్రభుత్వ స్కూళ్లు ఎందు వల్లనో ఇప్పుడా పరిస్థితిలో లేవని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడలేక పోతున్నామని దీనికి దారితీసిన కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని శ్రీధర్ బాబు సూచించారు.

“స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగు పర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ చదువులను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఇందుకు అనువైన పరిస్థితులను విద్యాశాఖ కల్పించాలి. గుజరాత్ నుంచి ఏటా 30-40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయాలు సింగపూర్ కు వెళ్లి ఉన్నత శిక్షణ పొంది వస్తున్నారు. ఆ తరహా ప్రయత్నం మనవద్ద కూడా జరగాలి. అని విద్యాశాఖ అధికారులను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. సింగపూర్ ప్రభుత్వం మన దగ్గర ప్రపంచస్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. త్వరలోనే సింగపూర్ బృందం పర్యటిస్తుంది. మన ఉపాధ్యాయులను కూడా ఇతర దేశాలకు పంపించి నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది”. దానికి సంబంధించిన విధివిధానాలు సిద్ధం చేయాలని శ్రీధర్ బాబు ఉన్నతాధికారులను ఆదేశించారు.

వచ్చే 2-3 ఏళ్లలో మన విద్యావిధానంలో సమూల మార్పులు జరగాలి. విద్యపై ఎంతో ఖర్చు పెడుతున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్ళను పరిశీలించి అందులో మెరుగైన విధానాలను అమలు చేసే విషయం పరిశీలించాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సును పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలి. కింది తరగతుల నుంచే విద్యార్థులకు కృత్రిమ మేధపై అవగాహన కల్పించాలి. హైస్కూలు స్థాయిలో దానిని వినియోగించి తెలివితేటలను పెంచుకునేలా చూడాలి. భేషజాలకు పోకుండా కన్సల్‌టెంట్ల సేవలను తీసుకోవాలి..అని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.

Next Story