భార‌త్‌కు రానున్న ఎలాన్ మస్క్.. ఐటీ మంత్రి వెల్‌క‌మ్ ట్వీట్

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారతదేశానికి రానున్న నేప‌థ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను స్వాగ‌తించారు. .

By Medi Samrat  Published on  11 April 2024 4:15 PM IST
భార‌త్‌కు రానున్న ఎలాన్ మస్క్.. ఐటీ మంత్రి వెల్‌క‌మ్ ట్వీట్

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారతదేశానికి రానున్న నేప‌థ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను స్వాగ‌తించారు. భారతదేశంలోనే అతి పిన్న వయసున్న రాష్ట్రమైన తెలంగాణ మిమ్మల్ని భారతదేశానికి స్వాగతిస్తోందని ఆయ‌న‌ X లో ఒక పోస్ట్ చేశారు. ఈవీ కార్ల దిగ్గజం టెస్లాను రాష్ట్రానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఏప్రిల్ 4న శ్రీధర్ బాబు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం "ప్రపంచ బిజినెస్‌ దిగ్గజాల ద్వారా ప్రధాన పెట్టుబడి అవకాశాలపై చురుకుగా దృష్టి సారిస్తోందని.. ఇందులో భాగంగా మేము భారతదేశంలో టెస్లా ప్రణాళికాబద్ధమైన పెట్టుబడి కార్యక్రమాలను అధ్యయనం చేస్తూ.. ట్రాక్ చేస్తున్నామని" ఆయన చెప్పారు. తెలంగాణలో టెస్లా తమ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు తమ బృందం అన్ని ప్రయత్నాలు చేస్తుంద‌ని.. టెస్లాతో చర్చలు కొనసాగిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన భారత పర్యటనను ధృవీకరించిన నేప‌థ్యంలో.. నెటిజన్లు ఆయ‌న‌ను దేశానికి రావాల‌ని స్వాగతించారు. "భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నానని ఆయ‌న ట్విట‌ర్‌లో పోస్టు ద్వారా పంచుకున్నారు. ఆ పోస్ట్ భారీగా వైర‌ల్ అయ్యింది. ల‌క్ష‌ల మంది నెటిజ‌న్లు ఆయ‌న‌ను దేశానికి రావాల‌ని ఆహ్వానించారు. మీరు ఇక్కడకు వస్తున్నందుకు సంతోషిస్తున్నాము. టెస్లా ఇండియాను త్వరలో అమలులోకి తీసుకురావాలని ఆశిస్తున్నామ‌ని నెటిజ‌న్లు రాసుకొచ్చారు.

ఎలాన్ మస్క్‌ ఏప్రిల్ 22న న్యూ ఢిల్లీలో PM మోడీని కలవబోతున్నట్లు సమాచారం. ఈ ప‌ర్య‌ట‌న‌లో మస్క్ తన పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉంది. దేశంలో 2-3 బిలియన్ డాలర్ల ఉత్పాదక ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. EV తయారీని ప్రారంభించి వాహనాలను ఎగుమతి చేసేందుకు టెస్లా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల‌లో ఏదో ఒక రాష్ట్రాన్ని ఎంచుకోనున్న‌ట్లు తెలుస్తుంది. ఈ విష‌య‌మై స‌మావేశం త‌ర్వాత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Next Story