రామరాజ్యం పేరుతో దాడులు చేస్తే సహించేది లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు.

By Knakam Karthik  Published on  10 Feb 2025 5:41 PM IST
Telangana, Hyderabad, Minister SridharBabu, Chilkur Balaji Temple, Rangarajan,

రామరాజ్యం పేరుతో దాడులు చేస్తే సహించేది లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. రామరాజ్యం పేరుతో దాడులు చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. రామరాజ్యం పేరుతో చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, నిర్వాహకులు అయిన సౌందర్య రాజన్‌పై దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ రాజ్యం పేరుతో రౌడీయిజం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాముడి పేరును కించపరుస్తూ అరాచక, అనాగరిక కార్యక్రమాలకు పాల్పడటం దుర్మార్గం అని అన్నారు. వారు చేసే ఆగడాలకు రాముడి పేరును ఉపయోగించుకుంటూ రామరాజ్యం అని చెప్పడం క్షమించరాని నేరం అన్నారు. అంతేకాకుండా రాముడి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే చర్యగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

కొందరు ప్రజలలో ఉన్న హిందుత్వ భావాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు.. ఇలాంటి వారి పట్ల పోలీసులు, ప్రజలు, రాజకీయ పార్టీలు అందరూ అప్రమతంగా ఉండాలని సూచించారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలు, అరాచక శక్తుల పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ధర్మాన్ని కాపాడుతూ సమాజ హితం కోసం నిస్వార్థంగా పని చేస్తున్న అర్చకుల పట్ల ఇలాంటి దాడులు అమానుషం అని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story