ఆరోగ్యం రంగంలో తెలంగాణ రాష్ట్రం మంచి అభివృద్ధి సాధిస్తోందని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. హెల్త్ కేర్ ఇండెక్స్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలవడంపై అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం ఆధ్వర్యంలో 15వ గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ జరిగింది. ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆరోగ్య రంగంలో అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణకు అభినందనలు తెలిపారు. అలాగే కరోనా నిబంధనలు పాటించాలని, మనల్ని మనం కాపాడుకోవాలని సూచించారు.
కోవిడ్ వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అపోహాలను, భయాలను తొలగించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. భారత్ ఫార్మాస్యూటికల్స్‌లో మంచి ఫలితాలను సాధిస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా రోజు రోజుకు మెడికల్ టూరిజం పెరుగుతోందన్న వెంకయ్య.. గ్రామాల్లో ఆరోగ్య రంగాన్ని మరింత డెవలప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. టెలీ మెడిసన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించవచ్చన్నారు. ఆన్‌లైన్ కన్సల్టేషన్, ఆన్‌లైన్ మెడిసన్ డెలివరీ సేవల ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.