ఉద్యోగ నియామకాల్లో.. దేశానికే తెలంగాణ ఒక రోల్‌ మోడల్: సీఎం

ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక మోడల్ గా నిలబడింది అని ముఖ్యమంత్రి వివరించారు.

By అంజి
Published on : 21 March 2025 7:17 AM IST

Telangana, role model, job recruitment, CM Revanth Reddy

ఉద్యోగ నియామకాల్లో.. దేశానికే తెలంగాణ ఒక రోల్‌ మోడల్: సీఎం

“దశాబ్ద కాలం అవకాశాల కోసం ఎదురుచూసిన మీ కల నెరవేరుతోంది. ఇదొక అనిర్వచనీయ సందర్భం. ఉద్యోగాల్లో చేరుతున్న మీ అందరికీ అభినందనలు. మీరంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం వచ్చింది. జీవిత కాలం గుర్తుండిపోయే సందర్భం. తెలంగాణను ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడంలో మీరంతా భాగస్వాములు కావాలి” అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న అభ్యర్థులను ఉద్దేశించి పిలుపునిచ్చారు.

“ప్రజా ప్రభుత్వం – కొలువుల పండుగ” పేరిట పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాల శాఖల్లో కారుణ్య, ఇతర నియామకాల కింద 922 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ.. ''కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా మీకు చెందాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు.. గత ప్రభుత్వాలు దాదాపు 2015 నుంచి కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో జీవితంలో అత్యంత విలువైన మీ సమయం కాలగర్భంలో కలిసిపోయింది.

తెలంగాణ ఏర్పడితే ఖాళీలన్నింటినీ భర్తీ చేసి యువతలో ఒక విశ్వాసాన్ని, ఆత్మస్థయిర్యాన్ని పెంచడానికి ప్రభుత్వాలు పనిచేస్తాయని భావించారు. కానీ యువతీ యువకుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం.

ఉద్యోగం జీవితంలో వారికి ఒక మరుపురాని గొప్ప అనుభూతిగా మిగిలిపోతుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ తొలి ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వాలు లేవు. ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక మోడల్ గా నిలబడింది" అని ముఖ్యమంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ రావు, ఎస్. వేణుగోపాలా చారి, పలువురు ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్‌ విజయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story