తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక నిర్ణయం.. అంద‌రికీ అవ‌కాశం

Telangana intermediate board key decisions.తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2021 6:05 AM GMT
తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక నిర్ణయం.. అంద‌రికీ అవ‌కాశం

తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న ప్ర‌తి ఒక్క విద్యార్థికి సీటు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. అవ‌సరం అయితే.. అద‌న‌పు సెక్ష‌న్లు ఏర్పాటు చేయాల‌ని క‌ళాశాల‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది. బ్యాచ్‌ల వారీగా క్లాసులు నిర్వ‌హించ‌నున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ ఏడాది ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అంద‌రిని పాస్ చేసింది.

ఈసారి అందరూ పాస్ కావ‌డం వ‌ల్ల ఇంట‌ర్‌లో ఎక్కువ మంది చేరే అవ‌కాశం ఉంద‌ని ఇంట‌ర్ బోర్డు అంచ‌నా వేసింది. ప్రతి ఒక్కరికీ కాదనకుండా సీటు కల్పిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని అధికారులు భావి స్తున్నారు. అందుక‌నుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఒక వేళ ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లో విద్యార్థుల‌కు సీటు ల‌భించ‌క‌పోతే.. వారు ప్రైవేటు కాలేజీల్లో ఎక్కువ మొత్తం ఫీజు చెల్లించి చేరాల్సి వ‌స్తుంద‌ని.. అందరినీ పాస్‌ చేసి ఇంటర్‌లో సీటు లేదని చెప్పడం సబబు కాద న్న భావన విద్యాశాఖ వర్గాల్లో ఉంది.

ఇప్ప‌టికే ప్ర‌భుత్వ కాలేజీల్లో 75వేల మంది చేరార‌ని అధికారులు చెబుతున్నారు. కాగా.. 2021–22 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు ఇంటర్‌ బోర్డు అధికారులు పొడిగించారు.ఈ సారి రాష్ట్రంలో 5.70 లక్షల మంది విద్యార్థులు టెన్త్‌లో పాసయ్యారు. మొత్తం 2,500 వరకు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు న్నాయి. వాటిల్లో 5 లక్షల వరకు సీట్లున్నాయి.

Next Story