గుడ్‌న్యూస్.. విద్యార్థులంతా పాస్.. వెబ్‌సైట్‌లో ఇంటర్ ఫస్టియర్ మెమోలు
Telangana Inter Board officially said all students pass.తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త
By తోట వంశీ కుమార్ Published on 7 Jan 2022 2:32 AM GMTతెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు కనీస మార్కులు వేసి పాస్ చేసినట్లు ప్రకటించింది. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ ( tsbie.cgg.gov.in) ద్వారా ఈ రోజు(శుక్రవారం) సాయంత్రం 5 గంటల నుంచి మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫీజును వెనక్కి తీసుకునే అవకాశం కల్పించింది. రీకౌంట్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సాయంత్రం 5 గంటల నుంచి తమ దరఖాస్తులను రద్దు చేసుకోవచ్చునని తెలిపింది. ఈ నెల 17 వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని అధికారులు చెప్పారు. ఇక విద్యార్థులు చెల్లించిన ఫీజును ఫిబ్రవరి 1 నుంచి కాలేజీల్లో తీసుకోవచ్చునని ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో గతేడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించకుండానే ఆయా విద్యార్థులను సెకండియర్ లోకి ప్రమోట్ చేశారు. అయితే.. అక్టోబర్‌లో ఫస్టియర్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో కేవలం 49 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులతో పాటు వివిధ సంఘాల నుంచి ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేయాలన్న డిమాండ్లు ఆయా వర్గాల నుంచి వినిపించాయి. దీంతో ప్రభుత్వం ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంకా ఎక్కువగా మార్కులు సాధించగలమని నమ్మకం ఉన్న విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ సైతం రాసే అవకాశాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్ బోర్డ్ తాజాగా విద్యార్థులందరూ పాస్ అయినట్లు ప్రకటించింది. వెబ్ సైట్ నుంచి మార్క్స్ మెమోలను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.