అలా పాస్ చేసే ఆలోచ‌నే లేదు.. ఒక‌ట్రెండు రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌ : ఇంటర్ బోర్డు క్లారిటీ..

Telangana Inter board clarifies on practical exams. కరోనా కారణంగా గత రెండు సంవ‌త్స‌రాలుగా విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న

By Medi Samrat
Published on : 6 Feb 2022 12:36 PM IST

అలా పాస్ చేసే ఆలోచ‌నే లేదు.. ఒక‌ట్రెండు రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌ : ఇంటర్ బోర్డు క్లారిటీ..

కరోనా కారణంగా గత రెండు సంవ‌త్స‌రాలుగా విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో కరోనా కేసుల విపరీతమైన పెరుగుదల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండగా తెలంగాణలో ఈసారి కూడా ప్రాక్టికల్ పరీక్షలు ఉండబోవని గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ సారి కూడా ప్రాక్టికల్స్ నిర్వహణ సందిగ్ధంలో పడినట్లు కొన్ని పత్రికల్లో వార్తాకథనాలు వచ్చాయి. ఈ విషయమై ఇంటర్ బోర్డు స్పష్టత ఇచ్చింది.

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టిన ఇంటర్ బోర్డు.. క్లారిటీ ఇచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ విషయమై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 'గత సంవత్సరం కరోనా కారణంగా భౌతిక‌ తరగతులు లేవు. 45 రోజులు మాత్రమే తరగతులు జ‌రిగాయి. దీంతో విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. అయితే. 2021-2022 విద్యా సంవత్సరంలో పరిస్థితి మారిపోయింది. జనవరిలో కేవలం 14 రోజులు మాత్రమే కళాశాలలు మూసివేయబడ్డాయి. ఫిబ్రవరి 1 నుండి తరగతులు యథావిధిగా కొనసాగుతున్నాయి.

వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని థియరీ పరీక్షలకు ముందు యథావిధిగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని.. పరీక్షలు నిర్వహించకుండా పాస్‌ చేసే ఆలోచన లేదని బోర్డు పేర్కొంది. మేము ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రాక్టికల్, థియరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తాము. ఈ విషయాన్ని విద్యార్థులందరూ గమనించాలని తెలంగాణ బోర్డు స్పష్టం చేసింది.


Next Story