Telangana: అలర్ట్.. రేపటి నుంచి అతి భారీ వర్షాలు
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌లో జూలై 18 నుంచి నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
By అంజి Published on 17 July 2024 12:02 PM ISTTelangana: అలర్ట్.. రేపటి నుంచి అతి భారీ వర్షాలు
హైదరాబాద్: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌లో జూలై 18 నుంచి నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నిర్మల్, హన్మకొండ, సిద్ధిపేట, నారాయణ్‌పేట్, జగిత్యాల, సూర్యాపేట తదితరల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సు ఉందని పేర్కొంది.
ఈరోజు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌లో కూడా ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. జూలై 20 వరకు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) గణాంకాల ప్రకారం.. నిన్న కుమురం భీమ్ జిల్లాలో అత్యధికంగా 137.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా ఖైరతాబాద్‌లో 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మెదక్ జిల్లాలో 26.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. హైదరాబాద్, తిరుమలగిరిలో 29.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది.
కాగా, రానున్న వర్షాకాల సవాళ్లను పరిష్కరించేందుకు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, ఎంటమాలజీ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాలతోపాటు వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. IMD హైదరాబాద్ అంచనా వేసిన వర్షపాతం దృష్ట్యా, నివాసితులు తదనుగుణంగా తమ ప్రణాళికలను రూపొందించుకోవాలి.