తెలంగాణలో పలు చోట్ల వర్షాలు.. సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ

హైదరాబాద్‌తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు.

By Srikanth Gundamalla  Published on  16 May 2024 6:13 PM IST
telangana, hyderabad, heavy rain, cm revanth reddy,

  తెలంగాణలో పలు చోట్ల వర్షాలు.. సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ 

తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరంలో సాయంత్రం 4 గంటల నుంచే కుండపోతగా వాన కురుస్తోంది. దాంతో.. నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దాదాపుగా ఉద్యోగస్తులు అంతా ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగు పయనం అవుతున్న సమయం కావడంతో.. ఆయా చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

హైదరాబాద్‌తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. వర్షం పడుతున్న సమయంలోనే సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయానికి వెళ్లారు. అన్ని విభాగాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలో వర్షం ప్రభావం ఉన్న ప్రాంతాలపై ఆయన ఆరా తీశారు. వర్షాలు, వర్షం తర్వాత ఏర్పడే పరిస్థితులపై అధికారులతో చర్చించారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల పడ్డ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న విషాద సంఘటనల గురించి కూడా చర్చించారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో అదికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రజల నుంచి ఏవైనా ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.

మరోవైపు హైదరాబాద్‌లో వానల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా వెంటనే సహాయం కోసం కాల్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెల్ప్‌ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. GHMC-DRF సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు ఫోన్ చేయాలని పేర్కొంది.

జీహెచ్‌ఎంసీ మేయర్ సహా ఇతర అధికారులు వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఒక పక్క భారీ వర్షాలతో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వర్షం వేళ అవ‌స‌ర‌మైతే త‌ప్ప ప్రజ‌లు ఇళ్లలో నుంచి బ‌య‌ట‌కు రావొద్దని సూచించింది.

Next Story