వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా నిలువరించాలని వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అవినాశ్ రెడ్డిపై సోమవారం వరకు చర్యలు తీసుకోవద్దని ఇటీవల ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు.. నేడు ఆ పిటిషన్ పై విచారణ కొనసాగించింది. తీర్పును రిజర్వులో ఉంచింది. సీబీఐ తదుపరి విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్ పైనా తీర్పును రిజర్వులో ఉంచినట్టు హైకోర్టు ధర్మాసనం తెలిపింది. తీర్పు వెల్లడించే వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐకి స్పష్టం చేసింది. సీబీఐ ఆఫీసు వద్ద అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు జరుగుతుండగా సీబీఐ కార్యాలయం వద్దే ప్రెస్ మీట్ ఏంటని ప్రశ్నించింది.
విచారణ సందర్భంగా సీబీఐ అవినాశ్ కు సంబంధించిన వివరాలను ఓ సీల్డ్ కవర్ లో హైకోర్టుకు అందించింది. 35 వాంగ్మూలాలు, 10 కీలక పత్రాలు, పలు ఫొటోలను సమర్పించింది. అవినాశ్ రెడ్డి విచారణను ఆడియో-వీడియో రికార్డింగ్ చేస్తున్నామని కోర్టుకు తెలిపింది. ఈ కేసులో సాక్ష్యాల ధ్వంసంలో అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ స్పష్టం చేసింది. అందువల్ల, అవినాశ్ పై తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇవ్వొద్దని హైకోర్టును కోరింది. ప్రశ్నించే సమయంలో అవినాశ్ కనిపించేలా ఆయన న్యాయవాదికి అనుమతి ఇవ్వగలరా? అని సీబీఐని హైకోర్టు ధర్మాసనం అడిగింది. అవినాశ్ కనిపించేలా ఆయన న్యాయవాదిని విచారణకు అనుమతించే విషయం పరిశీలిస్తామని సీబీఐ తెలిపింది.