సర్పంచ్‌ ఎన్నికలపై స్టే విధించలేం: హైకోర్టు

పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

By -  అంజి
Published on : 28 Nov 2025 12:00 PM IST

Telangana, High Court, stay, Sarpanch elections

సర్పంచ్‌ ఎన్నికలపై స్టే విధించలేం: హైకోర్టు

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ దశలో సర్పంచ్‌ ఎన్నికలపై స్టే విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌ విడుదల అయ్యాక కోర్టుల జోక్యం ఉండదన్న ఎలక్షన్‌ కమిషన్‌ తరఫు లాయర్ల వాదనలతో కోర్టు ఏకీభవించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 నెలలకు వాయిదా వేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 22న జీవో నంబర్‌ 46ను తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి గరిష్ఠంగా 50 శాతం మించకూడదు. దీని ప్రకారం బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కుతాయని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్లు కోర్టు తీసుకెళ్‌లారు. బీసీలలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని అభ్యర్థించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయ్యాక ఎందుకు సవాల్‌ చేస్తున్నారని ప్రశ్నించింది.

''ఈ దశలో ఎన్నికలను స్టే ఇవ్వలేము. సబ్ క్యాటగిరీ రిజర్వేషన్లు లేవని ఎన్నికలు రద్దు చేయాలనుకుంటున్నారా? 42% రిజర్వేషన్ GO విచారణలో ఉండగా పాత విధానంలో ఎన్నికలు నిర్వహించాలని మేమే చెప్పాం. మేమే ఎన్నికలు నిర్వహించమని చెప్పి, మేమే స్టే ఎలా ఇస్తాం?'' అని హైకోర్టు పేర్కొంది. 6 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Next Story