Telangana: గణపతి విగ్రహాల నిమజ్జనాలపై హైకోర్టు కీలక ఆదేశాలు
గణేశ్ నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 2:15 PM ISTTelangana: గణపతి విగ్రహాల నిమజ్జనాలపై హైకోర్టు కీలక ఆదేశాలు
గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా రకరకాల భంగిమలతో ఉన్న విఘ్నేశ్వరుడిని నిలబెడతారు భక్తులు. కొందరు భారీ విగ్రహాలను పెట్టి అందరి దృష్టి తమ వినాయకుడి విగ్రహం వైపు మళ్లిస్తారు. ఇంకొందరు పెద్ద స్టేజ్ వేసి తమ భక్తిని చాటుకుంటారు. భారీ ఎత్తున విగ్రహాలను నిలబెట్టడం ఏమో కానీ.. వాటిని నిమజ్జనం చేయడం విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గణేశ్ నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిమజ్జనం సమయంలో హైకోర్టు ఉత్తర్వులు యథాతథంగా అమలు చేయాలని.. పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లకు సూచనలు చేసింది. పీవోపీ విగ్రహాలు అన్నీ జీహెచ్‌ఎసీ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని తెలిపింది. అంతేకాని.. హుస్సేన్ సాగర్ చెరువులలో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు సూచించింది. ఎవరైనా హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి హుస్సేన్ సాగర్ లేదంటే ఇతర చెరువులలో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేస్తే.. వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హైకోర్టు స్పష్టంచేసింది.
ఈ క్రమంలో పోలీస్ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు వారి వారి పరిధిలో ప్రజలు నిలబెట్టిన పీవోపీ గణేశ్ విగ్రహాలను కేవలం కృత్రిమ కొలనులోనే నిమజ్జనం చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అలాకాకుండా హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చయడం ద్వారా నీరు కలుషితం అవుతుందని తెలిపింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు పీవోపీ విగ్రహాల నిమజ్జనాలపై ఆదేశాలను జారీ చేసింది.