24 గంటల్లో ఏదీ మార్చలేరు, వీకెండ్‌లో కూల్చివేతలేంటి? హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్

హైడ్రా అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యింది.

By Knakam Karthik  Published on  18 Feb 2025 10:50 AM IST
Telugu News, Hyderabad, Hydra, HighCourt, AV RangaNath

24 గంటల్లో ఏదీ మార్చలేరు, వీకెండ్‌లో కూల్చివేతలేంటి? హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్

హైడ్రా అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యింది. శనివారం నోటీసులు, ఆదివారం కూల్చివేతలు ఆపాలని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తెల్లవారేసరికి హైదరాబాద్‌ను మార్చేస్తా అన్న భ్రమలో హైడ్రా ఉందని.. 24 గంటల్లో ఏదీ మార్చలేరనే ఈ విషయాన్ని హైడ్రా గుర్తుపెట్టుకోవాలని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో హైడ్రా అధికారులు ఆదివారం రోజు ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించిన షెడ్‌ను కూల్చివేయడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా కూడా తనకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టి అక్కడి హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. సెలవు రోజు కూల్చివేతలు చేపట్టవద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

వీకెండ్స్‌లో కూల్చివేతలు చేపట్టరాదని, హైకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు ఎందుకు పాటించడంలేదని హైకోర్టు ప్రశ్నించింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టరాదని తీర్పు కాపీలను హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఇచ్చామని వాటిని చదువుకోవాలని సూచించింది. హైడ్రా 24 గంటల నోటీసులు ఆదివారం కూల్చివేతలపై హైకోర్టులో ఇప్పటికే చాలా పిటిషన్లు దాఖలు అయ్యాయని..సెలవు రోజుల్లో కూల్చివేతలను తీవ్రంగా తప్పు పట్టింది. చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడుతున్న హైడ్రా సంస్థ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ ఈనెల 20న కోర్టుకు ప్రత్యక్షంగా హాజరై కూల్చి వేతలపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

Next Story