రామప్ప దేవాలయం సంరక్షణపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు
Telangana High Court on Historical Ramappa Temple. తెలంగాణలోని రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా ఇటీవలే యునెస్కో గుర్తించింది.
By Medi Samrat Published on 28 July 2021 4:36 PM IST
తెలంగాణలోని రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా ఇటీవలే యునెస్కో గుర్తించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. ములుగు జిల్లాలో ఉన్న పాలంపేటలో 800 ఏళ్ల కాలం నాటికి చెందిన ఆలయం కాకతీయ శిల్పకళా వైభవానికి యునెస్కో గుర్తింపు వచ్చింది. ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాబితాలో చేర్చేందుకు నార్వే వ్యతిరేకించినా, రష్యా సహా 17 దేశాలు ఆమోదం తెలిపాయి.
'రామప్ప' దేవాలయం సంరక్షణకు సమగ్ర చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. రామప్పకు ప్రపంచ గుర్తింపు రావడం రాష్ట్రానికి గర్వకారణమని, అలాంటి రామప్ప దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తే దేశం మొత్తం నిందిస్తుందని అసహనం వ్యక్తం చేసింది. యునెస్కో గడువు విధించిన డిసెంబర్ లోపు రక్షణ చర్యలను ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది. రామప్ప అభివృద్ధి, సంరక్షణను తామే స్వయంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.
రామప్ప సంరక్షణపై వార్తా పత్రికలు, చానెళ్లలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిల హైకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర పురాతత్వ శాఖలు, జిల్లా కలెక్టర్ తో వెంటనే కమిటీని వేయాలని, క్షేత్రస్థాయి పరిశీలన చేసి వచ్చే నెల 4న కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించాలని తేల్చి చెప్పింది. నెలలోగా రామప్ప సంరక్షణ చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రపంచ అంచనాలకు అనుగుణంగా రామప్పను అభివృద్ధి చేయాలని రాష్ట్ర సర్కారుకు హైకోర్టు సూచించింది.