బర్రెలక్కకు సెక్యూరిటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష

By Medi Samrat  Published on  24 Nov 2023 6:56 PM IST
బర్రెలక్కకు సెక్యూరిటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తూ ఉంది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన బర్రెలక్క.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగింది. బర్రెలక్క తమ్ముడిపై కొందరు వ్యక్తులు దాడి చేయటం సంచలనంగా మారింది. పోలీసులు భద్రత ఇవ్వటం లేదంటూ హైకోర్టులో పిటీషన్ వేశారు. ప్రచారం చేయొద్దని.. పోటీ నుంచి తప్పుకోవాలంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కోర్టుకు తెలిపింది. పిటీషన్ పై విచారణ చేసిన హైకోర్టు.. ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్క అలియాస్ శిరీష కుటుంబం మొత్తానికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ కు కూడా సమాచారం ఇచ్చింది. శిరీష్ ప్రచారం చేసే సమయంలోనూ రక్షణ ఇవ్వాలని.. ఎన్నికలు పూర్తయ్యే వరకు అభ్యర్థి భద్రత పోలీస్ శాఖ బాధ్యత అని హైకోర్టు సూచించింది.

కర్నె శిరీషది నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం.. తల్లి, ఇద్దరు తమ్ముళ్లతో ఉంటోంది. తండ్రి వీరిని వదిలేసి వెళ్లాడు. దీంతో శిరీష తల్లి రోజు కూలీగా మారి కుటుంబాన్ని గెంటుకొస్తోంది. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూనే కుటుంబానికి ఆసరగా ఉండేందుకు శిరీష కూడా కూలీ పనులకు వెళ్లేది. తల్లిని అడిగి నాలుగు బర్రెలను కొని, వాటి పాలు అమ్ముతూ డబ్బు సంపాదిస్తోంది. ఓ రోజు తనలాంటి నిరుద్యోగుల ఆవేదనను జనాలందరికీ తెలిసేలా ఓ వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇన్ స్టాలో సంచలనం సృష్టించింది. కర్నె శిరీష కాస్తా బర్రెలక్కగా మారిపోయింది. వైరల్ వీడియో కారణంగా శిరీషపై కొందరు కక్ష సాధింపునకు కూడా దిగారు. దాని కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. వేధింపులపై పోరాడుతూనే శిరీష అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. నిరుద్యోగుల గొంతుకగా నామినేషన్ వేసింది. అఫిడవిట్ లో ఆమె ఆస్తుల వివరాలు.. బ్యాంక్ ఖాతాలో రూ.1,500, చేతిలో రూ.5 వేలు ఉన్నట్లు వెల్లడించింది. తనకు సపోర్ట్ చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన వీడియోకు విపరీతమైన స్పందన వచ్చింది. కొంతమంది నేరుగా ప్రచారానికి వస్తుండగా ఇంకొంత మంది తమకు తోచిన నగదు సాయం చేస్తున్నారు.

Next Story