వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన రికార్డులు, ఫైల్స్ను హార్డ్ డిస్క్లో భద్రపరించి ఈ నెల 13 లోగా సమర్పించాలని సీబీఐకి సూచించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. మంగళవారం అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశివ్వాలంటూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారించింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటీషన్ లో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. తనపై వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసినందున తమ వాదనలు వినాలని హైకోర్టును ఆమె ఆభ్యర్థించారు.
అవినాశ్ విచారణను వీడియో రికార్డింగ్ చేస్తున్నామని సీబీఐ న్యాయవాది తెలిపారు. కోర్టు స్పందిస్తూ వీడియో రికార్డింగ్ ఏ దశలో ఉందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి నేడు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనను సీబీఐ విచారించడం ఇది మూడోసారి.