నాగార్జునకు ఊరట.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే ఇచ్చిన హై కోర్టు
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
By Medi Samrat Published on 24 Aug 2024 4:45 PM ISTఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) మాదాపూర్‌లో హీరో నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసింది. శనివారం తెల్లవారుజామున, హైడ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు 4-5 భారీ యంత్రాలతో భవనాన్ని కూల్చివేసేందుకు ప్రాంగణానికి చేరుకున్నాయి. భారీ భద్రత మధ్య హైడ్రా బృందం ఈ పనులు చేపట్టింది. కన్వెన్షన్ సెంటర్‌లో కొంత భాగం సరస్సు యొక్క బఫర్ జోన్‌లో నిర్మించారని, మూడున్నర ఎకరాల చెరువును ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కూల్చివేతలపై అక్కినేని నాగార్జున స్పందించారు. అధికారులు తప్పుడు సమాచారంతో ప్రవర్తించారని, ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేతలను చేశారని నాగార్జున విమర్శించారు. ఇది చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని.. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఉంటే ఆ ఆదేశాలకు కట్టుబడి ఉండేవాడినని నాగార్జున ట్వీట్ వేశారు. N కన్వెన్షన్ సెంటర్ ఉన్న భూమి ప్రైవేట్ ఆస్తి (పట్టా భూమి) అని నాగార్జున X పోస్ట్‌లో స్పష్టం చేశారు. నిర్మాణంలోని ఏ భాగం కూడా ఆక్రమించలేదని నొక్కి మరీ చెప్పారు. కూల్చివేతను నిరోధించడానికి ఇప్పటికే స్టే ఆర్డర్ ఉందని కూడా ఆయన వివరించారు.