రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు

Telangana high court granted bail to MLA Raja Singh. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎట్ట‌కేల‌కు బెయిల్ మంజూరైంది.

By Medi Samrat  Published on  9 Nov 2022 11:38 AM GMT
రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎట్ట‌కేల‌కు బెయిల్ మంజూరైంది. జైలులో ఉన్న ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విడుద‌లైన త‌ర్వాత ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు సూచించింది. ఇదిలావుంటే.. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ విధించడంపై హైకోర్టులో నిన్న వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. రాజాసింగ్ ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని, ఆయ‌న‌పై ఇప్పటికే 101 కేసులు ఉన్నాయని, అందులో18 కేసులు మత విద్వేషాలు రెచ్చ గొట్టేలా చేసిన కేసులు ఉన్నాయని.. బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. రాజాసింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలతో హైదరాబాద్‌లో ఓ వర్గం వారు నిరసనలు తెలియజేశారని.. పీడీ యాక్ట్ పెట్టడం సరైనదేనని అడ్వకేట్ జనరల్ వాదించారు.

మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. రాజాసింగ్ ఏ మతాన్నీ కించపరిచలేదని, ఏ మతాన్ని టార్గెట్ చేయలేదని వివరించారు. కేవలం బాల్య వివాహం అనే ఒక నాటకాన్ని మాత్రమే ప్రజెంట్ చేసాడని చెప్పారు. మహమ్మద్ ప్రవక్త అనే పదాన్ని ఎక్కడ కూడా రాజాసింగ్ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష తోనే రాజాసింగ్‌పై పిడి యాక్ట్ నమోదు చేశారని చెప్పారు. నాంపల్లి కోర్టు రిమాండ్ చెల్లదని రిజెక్ట్ చేసిందని.. అందుకే పీడీ యాక్ట్‌ను పోలీసులు నమోదు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.


Next Story