కోవిడ్ -19 కేసుల విషయమై రోజువారీ ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని తెలంగాణ హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతిరోజూ లక్ష ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ అధికారులను కోర్టు ఆదేశించింది. రోజువారీ కోవిడ్ బులెటిన్‌లో ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల వివరాలను ప్రత్యేకంగా అందించాలని ఆదేశించింది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్. తుకారాంజీతో కూడిన ధర్మాసనం.. కోవిడ్-19 వ్యాప్తిని తెలుసుకునేందుకు అవసరమైన పరీక్షల పట్ల అప్రమత్తతో ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది.
సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి కోవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోర్టు పేర్కొంది. విచారణ సందర్భంగా.. రాష్ట్రంలోని కోవిడ్ -19 పరిస్థితిపై చర్చించడానికి రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే సమావేశంలో మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కొత్త చర్యలను నిర్ణయించే అవకాశం ఉందని తెలిపారు. తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం.. విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. రాష్ట్రంలో తక్కువ కోవిడ్ పరీక్షలు నిర్వహించారనే విమర్శలు వస్తున్న నేఫథ్యంలో.. కోర్టు ఆదేశాలు ఆ వాదనకు బలం చేకూరినట్టయ్యింది.