ఆయన భారత పౌరుడు కాదు..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురుదెబ్బ
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
By Knakam Karthik
ఆయన భారత పౌరుడు కాదు..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురుదెబ్బ
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భారత పౌరుడు కాదని, జర్మన్ పౌరుడని రాష్ట్ర న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆయన పౌరసత్వంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేయగా... తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా తప్పుడు పత్రాలతో 15 ఏళ్ల పాటు ప్రభుత్వ అధికారులు, న్యాయస్థానాలను చెన్నమనేని రమేశ్ తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది.
అలాగే ఆయనను రూ. 30లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో పిటిషనర్ ఆది శ్రీనివాస్‌కు రూ. 25లక్షలు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి రూ. 5లక్షలు చెల్లించాలని తెలిపింది. న్యాయస్థానం తీర్పుపై అప్పీల్ చేయకుండా తన తప్పును ఒప్పుకుని చెన్నమనేని రమేశ్ రూ. 30 లక్షల ఫైన్ చెల్లించారు.
కాగా చెన్నమనేని రమేశ్ ఇండియన్ సిటిజన్ కాదని హైకోర్టు ఇచ్చిన తీర్పు పై వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రెస్పాండ్ అయ్యారు. చెన్నమనేని తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేయకుంటే పదేళ్ల క్రితమే నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని అంటూ వ్యాఖ్యానించారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన చెన్నమనేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చెన్నమనేని భారత పౌరుడు కాదని నేను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నా... 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో న్యాయమే గెలిచిందన్నారు. కోర్టులపై ప్రజలకు విశ్వాసం పెరిగింది..అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.