Telangana: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలపై.. ప్రభుత్వాన్ని రిపోర్ట్ కోరిన హైకోర్టు
ప్రభుత్వ ఆసుపత్రులకు ఎంత బడ్జెట్ కేటాయించారో నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Aug 2023 10:35 AM ISTTelangana: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలపై.. ప్రభుత్వ రిపోర్ట్ కోరిన హైకోర్టు
హైదరాబాద్: జిల్లాలు, తాలూకాలు, గ్రామాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఎంత బడ్జెట్ కేటాయించారో నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో గర్భిణి, ఆమె నవజాత శిశువు మృతి చెందడంపై దాఖలైన పిల్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. కోర్టు ఒక వార్తాకథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మార్చింది. డిసెంబర్ 28, 2022 న, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో నిరుపేద గర్భిణి మరణించిన విషయాన్ని స్థానిక దినపత్రిక హైలైట్ చేసింది.
నాగర్‌కర్నూల్ అమ్రాబాద్ మండలం యెల్మపల్లి గ్రామానికి చెందిన చరగొండ స్వర్ణ అనే ఇరవై నాలుగేళ్లు ప్రసవం కోసం అమ్రాబాద్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్య పరికరాలు, సిబ్బంది లేకపోవడంతో అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఆమెకు బీపీ పెరగడంతో నాగర్‌కర్నూల్‌లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. తర్వాత మళ్లీ మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి పంపగా, అక్కడ ఆమెకు మగబిడ్డ పుట్టాడు. ఆసుపత్రుల్లో తప్పనిసరి వైద్య పరికరాలు, వైద్యులు, ఇతరత్రా లేకపోవడంతో గర్భిణిని దురదృష్టవశాత్తు 5 ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. దీని కారణంగా వైద్య సహాయం అందించడంలో చాలా జాప్యం జరిగింది. దీని ఫలితంగా తల్లి, బిడ్డ.. ఇద్దరు మరణించారు.
జిల్లాలు, మండలాలు, గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య సదుపాయాలను విస్తరించడానికి టీఎస్ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ మొత్తంపై నివేదికను దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి నివేదికను కూడా కోర్టు కోరింది. అంతేకాకుండా జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల లభ్యత గురించి తెలుసుకోవాలన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ తన అఫిడవిట్‌లో మహిళను వెంటిలేటర్‌పై ఉంచాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలియజేశారు. అయితే ఆసుపత్రిలో వెంటిలేటర్లు లేకపోవడంతో ఆ మహిళ మృతి చెందింది. పిఐఎల్‌ను విచారించిన తర్వాత, సమగ్ర అఫిడవిట్‌ను దాఖలు చేయాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కోర్టు ఆదేశించింది. కేసు విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.