అనుకున్నదే జరిగింది. ఈటల రాజేందర్ మంత్రి పదవి ఊడింది. మెడికల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ పోర్టుఫోలియోను ఈటల రాజేందర్ నుండి తీసేసుకున్నారు. ప్రస్తుతానికి ఆ పదవిని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దగ్గర నుండి ఆమోదం కూడా లభించింది. భూ కబ్జాల ఆరోపణల నేపథ్యంలో ఈటల శాఖపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి ఈటల నుంచి వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేశారు. సీఎం కేసీఆర్ సిఫారసుకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు. ఆ లెటర్ ను ప్రెస్ కు విడుదల చేశారు.
మంత్రి ఈటల రాజేందర్ తమ భూములను కబ్జా చేశారని అచ్చంపేటకు చెందిన రైతులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుపై సీఎం సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి భూ వివాదంపై అధికారులు అచ్చంపేటలో విచారణ చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా అచ్చంపేట, హకీంపేట మధ్య, మంత్రి ఈటల ఫామ్‌హౌస్ సమీపంలో పోలీసులు భారీగా మోహరించారు.
ఇదిలావుంటే.. తన శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేసినట్లు తెలిసిందని.. ఇందుకు సంతోషిస్తున్నానని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నానన్నారు. సీఎంకు శాఖలపై సర్వాధికారాలు ఉంటాయి. ప్లాన్ ప్రకారమే నాపై భూకబ్జా ఆరోపణలు చేశారు. వాస్తవాలు త్వరలోనే తేలుతాయి. నా నియోజకవర్గ ప్రజలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఈటల అన్నారు.