జాగ్రత్తగా ఉంటే.. ఒమిక్రాన్ మన వద్దకు రాదు: ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
Telangana health minister harish rao on omicron variant. కోవిడ్ నిబంధనలు పాటిస్తే.. ఏ వ్యాధి కూడా మన వద్దకు రాదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
By అంజి Published on 3 Dec 2021 12:15 PM ISTకోవిడ్ నిబంధనలు పాటిస్తే.. ఏ వ్యాధి కూడా మన వద్దకు రాదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాస్తా జాగ్రత్తగా ఉండి డెల్టా, ఆల్ఫా, ఒమిక్రాన్ వేరింయట్లకు అడ్డుకట్ట వేయొచ్చని, కరోనా మహమ్మారిని అరికట్టొచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని మంత్రి హరీశ్ కోరారు. ఓల్డ్ బోయిన్‌పల్లిలో బస్తీ ఆస్పత్రిని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 2.51 కోట్ల మంది మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని, రెండో డోసు వ్యాక్సిన్ కోటి 30 లక్షల మంది మాత్రమే తీసుకున్నారని తెలిపారు. చాలా మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోలేదని, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
వ్యాక్సిన్లు సురక్షితమైనవని, అనుమానాలు, అపోహాలు అవసరం లేదని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకుంటే ప్రాణాలను రక్షించుకోవచ్చన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరై రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్లు వేసేందుకు ఆరోగ్య కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలకు మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలియజేశారు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణ రాలేదని మంత్రి తెలిపారు.
అయితే పక్క రాష్ట్రం కర్ణాటకలో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ నిర్దారించిందని అన్నారు. తెలంగాణలో దేవుని దయ వల్ల ఎలాంటి ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని అన్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించిన బ్రిటన్ దేశం నుండి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆమె నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించామని తెలిపారు. త్వరలోనే ఆమెకు ఏ వేరియంట్ సోకిందనేది తెలుస్తుందన్నారు. అందరూ మాస్కులు ధరించాలని, చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలని, స్వీయ నియంత్రణ పాటించాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు.