స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌.. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే..!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది.

By -  Medi Samrat
Published on : 9 Oct 2025 4:58 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌.. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే..!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.9 అమలును నిలిపివేస్తూ.. హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిన్న విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్‌పై ప్రతిష్టంభన నెలకొంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం, జీవో అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే.. ప్రభుత్వం సమర్పించే కౌంటర్‌పై అభ్యంతరాలు తెలిపేందుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రంలో శుక్రవారం నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఎన్నికల భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. తదుపరి విచారణలో వెలువడే న్యాయస్థానం తీర్పుపైనే ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉంటుంది.

Next Story