హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాలను స్వాధీనం చేసుకోవడం లేదా నిలిపివేయడం పోలీసులకు సాధ్యం కాదని తెలంగాణ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని డ్రైవింగ్ చేయనివ్వకూడదని, అయితే ఆ కారణంతో వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని జస్టిస్ ఇ.వి. వేణుగోపాల్ పేర్కొన్నారు.
2021లో హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ.. వాహనాన్ని సీజ్ చేయడానికి బదులుగా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను తీసుకుని, వాహనాన్ని సురక్షితంగా ఉంచాలని కోర్టు తెలిపింది. మద్యం సేవించని మరియు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉన్న యజమానికి లేదా వారి బంధువులకు వాహనాన్ని అప్పగించాలని సూచించింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని కోర్టు ఈ సందర్భంగా తేల్చి చెప్పింది.