రాష్ట్రంలో పాఠశాలలు తెరవడంపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జనవరి 31 నుంచి ప్రభుత్వం పాఠశాలలను తెరుస్తోందా అని కోర్టు ప్రశ్నించగా.. రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై పలు పిటిషన్‌లను విచారించిన ధర్మాసనం.. సమ్మక్క-సారలమ్మ జాతరకు చేసిన ఏర్పాట్లపై ఆరా తీసింది. మేడారం జాతర, వారాంతవు సంతల్లో కొవిడ్ జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. ఫీవర్ సర్వే సందర్భంగా 77 లక్షల ఇళ్లను సందర్శించి 3.45 లక్షల ఐసోలేషన్ కిట్‌లను ప్రజలకు అందజేసినట్లు కోర్టు విచారణకు హాజరైన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని రావు చెప్పారు. ఐసోలేషన్ కిట్‌లలో పిల్లలకు మందు ఇవ్వడంపై కోర్టు శ్రీనివాస్‌రావును ప్రశ్నించగా.. కిట్‌ల ద్వారా నేరుగా పిల్లలకు మందులు అందజేయరాదని.. విడిగా ఇవ్వాలని చెప్పారు. అయితే దీనిపై సవివరమైన నివేదికను సమర్పించాలని కోరిన ధర్మాసనం.. విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.