తెలంగాణ ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్
Telangana govt’s innovative schemes became role model to India. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వినూత్న పథకాలతో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని
By Medi Samrat Published on 15 Aug 2022 7:30 PM ISTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వినూత్న పథకాలతో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం కోసం సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన దార్శనికత కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా పథకాలను కూడా అమలు చేసిందని అన్నారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. వానకాలం 2022 సీజన్‌కు సంబంధించి జిల్లాలో 1,81,725 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.177.67 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. రైతు బీమా పథకం కింద ఇప్పటివరకు 456 మంది రైతులు మరణించగా.. 401 మంది రైతుల కుటుంబాలకు రూ.20.05 కోట్లు అందించామని తెలిపారు.
కరీంనగర్‌లో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేసింది. వైద్య కళాశాలను రూ.150 కోట్లతో 100 ఎంబీబీఎస్ సీట్లతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. వైద్య కళాశాలను మంజూరు చేసి జిల్లా కేంద్రాసుపత్రిని అప్‌గ్రేడ్ చేసేందుకు జీవో జారీ చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం గురించి ఆయన మాట్లాడుతూ.. దళితుల జీవితాల్లో సమగ్ర ఎదుగుదల కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించామన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్‌లో పథకం కోసం 17,840 దళిత కుటుంబాలను గుర్తించగా, ఇప్పటివరకు రూ.1,766.16 కోట్లు ఖర్చు చేయడం ద్వారా 15,373 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. పేదల సొంత ఇంటి కలలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకాలను ప్రవేశపెట్టి జిల్లాకు 6,494 ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. స్మార్ట్ సిటీ పథకం కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులతో కరీంనగర్ పట్టణం రూపురేఖలే మారిపోయాయి. రూ.520 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీలు చేపట్టినట్లు వెల్లడించారు.
రూ. 410 కోట్లతో చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కరీంనగర్ పట్టణానికే తలమానికంగా మారనుంది. కేబుల్ బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయని.. ఎంఆర్‌ఎఫ్ ప్రాజెక్టులో భాగంగా లోయర్ మానేర్ డ్యామ్ దిగువన బోటింగ్, వాటర్ స్పోర్ట్స్, లేజర్ షో, యోగా సెంటర్, ల్యాండ్‌స్కేపింగ్, గెస్ట్ హౌస్‌లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. చేనేత కార్మికుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా తరహాలో నేతన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలోని 19 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.3.47 కోట్ల నగదు రుణం అందించామని తెలిపారు.