శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెండింగ్‌లో ఉంచడంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషన్‌పై ధర్మాసనం కేంద్రం స్పందనను కోరింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రడూడ్, జిస్టస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాలతో కూడిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా గవర్నర్‌కు నోటీసులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. నోటీసులు అక్కర్లేదని, ఏం జరుగుతుందో తెలుసుకుంటామన్నారు. బిల్లుల ఆమోదంపై పురోగతిని తెలుసుకొని చెబుతానని కోర్టుకు తెలిపారు. నోటీసులు అవసరం లేదని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవి దృష్ట్యా నోటీసులు జారీ చేయొద్దని కోరారు. ఈ మేరకు కోర్టు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.