హైదరాబాద్: చేనేత కార్మికుల రుణమాఫీ అంశంపై మరో కీలక ముందడుగు పడింది. రుణమాఫీ కోసం రూ.33 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 మధ్య తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. చేనేత వస్త్రాల ఉత్పత్తి, కార్యనిర్వహణ మూల ధనం, ఇతర వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో వ్యక్తిగతంగా తీసుకున్న రూ.లక్ష వరకు రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
రుణమాఫీ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. రుణామాఫీ అమలు ప్రక్రియ కోసం ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ, చేనేత సంచాలకుడి అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా కమిటీ నుంచి వచ్చే ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదించిన తర్వాతే రుణమాఫీ మొత్తం ఆయా నేతన్నల ఖాతాల్లో జమ అవుతుంది. ఆ తర్వాత బ్యాంకర్లు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇస్తారు. నేతన్నలు కోరుకుంటే.. మళ్లీ ఆ మేరకు రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తాయి.