ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవలే ప్రకటించిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు తెలిపారు. ఫస్టియర్‌లో ఫెయిలయిన విద్యార్థులందరిని మినిమం 35 మార్కులతో పాస్ చేస్తున్నట్లు తెలిపారు. అందరిని పాస్ చేయడం ఇదే చివరిసారని.. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఉండవని పేర్కొన్నారు. కోవిడ్‌తో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొందని.. కోవిడ్ సంక్షభం కారణంగా మూడో తరగతి నుంచి పీజీ వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించామని మంత్రి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించామని.. అన్ని అంశాలు ఆలోచించిన తర్వాతే పరీక్షలకు వెళ్లామని ఆమె అన్నారు.
ఇదిలావుంటే.. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 49 శాతం మంది విద్యార్థులు పాసవ్వగా.. మిగిలిన 51 శాతం మంది ఫెయిలయ్యారు. అయితే.. ఫెయిలయిన విద్యార్థులలో ఎక్కువ మంది ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో చదివిన వారే ఉన్నారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై ప్రభుత్వాన్ని, సీఎంను టార్గెట్ చేయడం సరికాదని.. ప్రతీదీ రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు అలవాటైపోయిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇప్పటికైనా విద్యార్థులు సెకెండ్ ఇయర్ పరీక్షల కోసం కష్టపడి చదవాలని.. భవిష్యత్ లో ఇలా పాస్ చేయడం ఉండదని స్పష్టం చేశారు.
3వ తరగతి నుంచి పీజీ వరకు టి సాట్, డిజిటల్ క్లాసులు నిర్వహించామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 95 శాతం మంది ఇంటిలో దూరదర్శన్, 40 శాతం మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని ప్రభుత్వం దగ్గర వివరాలు ఉన్నాయని.. వాట్సాప్ గ్రూప్స్ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు క్లాసులు బోధించామని పేర్కొన్నారు. 9వ తరగతి పిల్లలని పరీక్షలు లేకుండానే 10వ తరగతికి ప్రమోట్ చేశామని.. అలాగే 10th వాళ్ళను ఇంటర్ కు పంపామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.