తెలంగాణలో త్వరలో 50వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు ఏ ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్న వివరాలను తేల్చే పనిలో నిమగ్నం అయ్యారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగ ఖాళీల వివరాలు సోమవారం రాత్రికి ప్రభుత్వానికి చేరాయి. వివిధ శాఖల్లో సుమారు 45వేలు, సంస్థల్లో 20 వేలు భర్తీ చేయాల్సి ఉందని ముఖ్య కార్శదర్శులు ప్రభుత్వానికి నివేదించారు. భర్తీ చేయాల్సిన వాటిలో అత్యధికశాతం పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య శాఖలోనే ఉన్నాయి.
పాఠశాల విద్యాశాఖలో 9,600 పోస్టులు ఖాళీగా ఉండగా.. అందులో ప్రత్యేక గ్రేడ్ ఉపాధ్యాయులు (ఎస్‌జీటీ) 5,800, స్కూల్ అసిస్టెంట్‌లు 2,500, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఖ్య 300, మోడల్ పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులు వెయ్యి వరకు ఉన్నట్టు అధికారులు సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఇవిగాక ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యాశాఖల పోస్టులు మరో మూడు వేల వరకు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో నాలుగో తరగతివి మినహాయించి మిగిలిన వాటిని ఖాళీలుగా చేపనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో పోస్టుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.