తెలంగాణలో బోనాల సందడి.. రేపు స్కూళ్లకు సెలవు

తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు పబ్లిక్‌ హాలిడేగా డిక్లేర్‌ చేసింది.

By అంజి  Published on  28 July 2024 9:19 AM GMT
Telangana govt, Public holiday, school, Bonalu festival

తెలంగాణలో బోనాల సందడి.. రేపు స్కూళ్లకు సెలవు

తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు పబ్లిక్‌ హాలిడేగా డిక్లేర్‌ చేసింది. రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతబడనున్నాయి. జులై 7వ తేదీన హైదరాబాద్‌ నగరంలో ప్రారంభమైన బోనాల సంబరాలు.. ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలు ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది.

కాగా హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బోనాల సందడి నెలకొంది. పాతబస్తీలో లాల్‌దర్వాజ బోనాల వేడుక ఘనంగా జరుగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టువస్త్రాలు సమర్పించారు.

బోరబండ బస్టాప్‌ వద్ద ఉన్న పోచమ్మ దేవాలయంలో బోనాల వేడుకలను స్థానిక కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

అటు ఆషాడ బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని గ్రేటర్‌ హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత శోభన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాశస్త్యం కల్పించిందని చెప్పారు. ఆషాడ బోనాల సందర్భంగా నాచారంలోని శ్రీమహంకాళి దేవాలయం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

Next Story