మీరందరూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండి: హరీశ్‌ రావు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర యువతను మోసం చేసిందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్ రావు అక్టోబర్ 6 ఆదివారం ఆరోపించారు.

By అంజి  Published on  6 Oct 2024 3:24 PM IST
Telangana govt, youth, unemployment, Harish Rao, BRS

మీరందరూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండి: హరీశ్‌ రావు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర యువతను మోసం చేసిందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్ రావు అక్టోబర్ 6 ఆదివారం ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు హామీలను నమ్మి జిల్లాల్లో ప్రచారం చేసిన యువత ఇప్పుడు నిరుద్యోగంతో అల్లాడుతున్నారని హరీశ్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు హామీలను అమలు చేయకపోవడంతో వృద్ధులకు పింఛన్లు అందడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణాలను అమలు చేయకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ మాజీ ఆర్థిక మంత్రి విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని నిరుద్యోగంపై హరీశ్‌ రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచినా ఎలాంటి పురోగతి లేదని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్‌ విస్మరించిందని ఆరోపించారు.

''గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలి. గ్యారెంటీలు అమలు చేయలేకపోగా, మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు బంధును నిలిపివేశారు, రైతు భరోసా దిక్కులేకుండా పోయింది, బోనస్‌ను బోగస్ చేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నరు, పది నెలలు గడిచాయి అతీ గతి లేదు. నాలుగు వేల నిరుద్యోగ భృతికి నీళ్లు వదిలారు. ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ ‌- బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండి. మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్‌లపై ఎక్కడిక్కడ నిలదీయాలని పిలుపునిస్తున్నాను'' అని హరీశ్‌ రావు ట్వీట్‌ చేశారు.

Next Story