రవాణా శాఖలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను ముమ్మరం చేసి ఆదాయాన్ని పెంచాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా రోడ్డు భద్రతకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'రహవీర్' స్కీమ్, 'క్యాష్ లెస్ ట్రీట్మెంట్' పథకాలను తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వ్యక్తులకు 'రహవీర్' అవార్డు కింద రూ. 25 వేల నగదు బహుమతిని ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత తొలి అవార్డును నల్గొండ జిల్లాకు చెందిన గణపతి వెంకన్నకు మంత్రి అందజేశారు. బాధితుడిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడినందుకు గాను ఆయనను అభినందిస్తూ రూ. 25 వేల చెక్కును అందజేశారు. అలాగే 'PM Rahath' పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు రూ. 1.50 లక్షల వరకు ఉచిత చికిత్స అందించవచ్చని, ఈ అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.
మరోవైపు, రవాణా శాఖ సేవల్లో తెలంగాణ దూసుకుపోతోందని మంత్రి పేర్కొన్నారు. 'సారథి' పోర్టల్ వినియోగంలో కేవలం 8 నెలల్లోనే రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల అధికారులను అభినందించారు. ఆదాయ లక్ష్యాలను చేరుకున్న జిల్లాల అధికారులకు ప్రశంసలు కురిపిస్తూనే, పనితీరు మందగించిన వారు తక్షణమే మార్పు చెందాలని హెచ్చరించారు. వాహన్ పోర్టల్ సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలని, జూన్ 1 నాటికి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 17 జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాల కోసం స్థల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, 'అరైవ్ అలైవ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.