తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కలెక్టర్, సంబంధిత అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్ సూచించారు. ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ దృష్ట్యా తాజా పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. జిల్లాల్లో స్థానిక నేతలు ప్రజల రక్షణ కోసం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు పోటెత్తుతోంది. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నీటిపారుదల శాఖ అధికారులు అలర్ట్‌గా ఉండాలని సీఎం చెప్పారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు రిస్క్ తీసుకోవద్దని, అత్యవసరమైతే త్ప ప్రజలు బయటకు రావొద్దని సీఎం సూచించారు. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ కేర్‌ను పాటించాలని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే భారీ వర్షాల నేపథ్యంలోనే ఈ నెల 15న జరగాల్సిన రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.