తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోంది
Telangana govt accords priority to women safety. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోందని, ఆ దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టిందని
By Medi Samrat
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోందని, ఆ దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం మేయర్ పీ. నీరజ, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదివారం షీ టీమ్స్ 2కే, 5కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. మహిళా భద్రతపై అవగాహన కల్పించేందుకు, లింగ సమానత్వాన్ని పెంపొందించేందుకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు 'సుస్థిరమైన రేపటి కోసం లింగ సమానత్వం' అనే థీమ్‌పై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి అజయ్‌కుమార్ ప్రసంగిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు భద్రత కల్పించేందుకు, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చొరవ తీసుకుని షీ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఫలితంగా మహిళలపై హింస, గూండాయిజం, చైన్ స్నాచింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. సీసీ కెమెరాల వ్యవస్థతో నిఘా పెంచడం ద్వారా నేరాలను అదుపులో ఉంచవచ్చని మంత్రి పేర్కొన్నారు. రన్ ద్వారా మహిళా భద్రత, లింగ సమానత్వంపై ప్రచారం నిర్వహించడం పట్ల పోలీసు కమిషనరేట్‌ను మంత్రి అభినందించారు. మహిళల భద్రత, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని అన్నారు.
ప్రెండ్లీ పోలీసింగ్ చర్యలు ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి, ప్రజల భద్రతకు దోహదపడతాయని కలెక్టర్ గౌతమ్ అభిప్రాయపడ్డారు. దాదాపు 10,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నగరంలో 24 గంటలూ నిఘా ఉంచామని కమిషనర్ ఆఫ్ పోలీస్ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. కార్యక్రమంలో పరుగు పూర్తి చేసిన వారికి మంత్రి ప్రశంసా పత్రాలు, పతకాలు అందజేశారు.