Republic Day 2024: రిపబ్లిక్‌ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.

By అంజి  Published on  26 Jan 2024 8:13 AM IST
Telangana, Governor Tamilisai, Republic Day

Republic Day 2024: రిపబ్లిక్‌ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌ తమిళిసై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందన్నాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్‌ శాంతి కుమారి పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. అలాంటి వారిని ప్రజలు సాగనంపారని కామెంట్ చేశారు. పదేళ్ల నియంతపాలనకు చరమగీతం పాడారని పేర్కొన్నారు. ఏక పక్ష నిర్ణయాలు, నియంతర ధోరణులు ప్రజాస్వామ్యానికి శోభనియ్యవని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు.

ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన తెలంగాణలో ఉందని చెప్పడానికి గర్విస్తున్నానన్నారు. అంబేద్కర్‌ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనార్టీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజాపాలన అడుగులు వేస్తోందని, ఇదే స్ఫూర్తితో ఇక ముందు కూడా పాలన సాగాలని కోరుకుంటున్నాన్నారు.

గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థికస్థితి దిగజారిందన్న గవర్నర్‌.. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.

Next Story