గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం
తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని అన్నారు గవర్నర్ తమిళిసై.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 10:18 AM ISTగత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత ప్రసంగించిన గవర్నర్ తమిళిసై గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలపై తీవ్రంగా మండిపడ్డారు. అయితే.. గతంలో బీఆర్ఎస్ సర్కార్‌కు, గవర్నర్ తమిళిసైకి మధ్య నిత్యం కోల్డ్ వార్ జరిగేది. ప్రభుత్వ కార్యక్రమాలకు పెద్దగా గవర్నర్‌ను ఆహ్వానించింది లేదు. ఈ క్రమంలోనే తాజాగా గత ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఫైర్ అయ్యారు.
తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని అన్నారు గవర్నర్ తమిళిసై. తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందనీ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నియంతృత్వ ధోరణికి ప్రజలు తమ తీర్పు ద్వారా చరమగీతం పాడారని అన్నారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పును అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఇచ్చారని గవర్నర్ తమిళిసై అన్నారు. పదేళ్ల పాలనలో రాజ్యంగ విలువలు, రాజ్యాంగబద్ద సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే పునర్‌నిర్మించుకుంటున్నామని అన్నారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్దమైన విలువలు, విధానాలు, పద్దతులను పునరుద్దరణ చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగిస్తేనే సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయని గవర్నర్ తమిళిసై అన్నారు.
ఏపపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభను ఇవ్వవు అని అన్నారు గవర్నర్. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలు పెట్టిందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యస్థను దెబ్బతీశాయని గవర్నర్ తమిళిసై చెప్పారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. వంద రోజుల్లో ప్రస్తుత ప్రభుత్వం గ్యారెంటీలను అమలు చేస్తుందని.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని గవర్నర్ తమిళిసై చెప్పారు.