ప్రగతి వైపు అడుగులు, రాష్ట్ర అభివృద్దే ధ్యేయం..బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ ప్రసంగించారు.
By Knakam Karthik Published on 12 March 2025 12:11 PM IST
ప్రగతి వైపు అడుగులు, రాష్ట్ర అభివృద్దే ధ్యేయం..బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని అన్నారు. సామాజిక న్యాయం, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలే కేంద్రంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. అభివృద్ధి, ప్రగతి వైపు అడుగులు పడుతున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధే తమ ధ్యయమని తెలిపారు. ఇప్పటి వరకు అన్నదాతలకు రూ.25 వేల కోట్ల రుణమాపీ చేశామని అన్నారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని తెలిపారు.
ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నాం. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నాం. అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోంది. రాష్ట్రానికి రైతులే ఆత్మ.. వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలు. రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉంది. దేశంలో అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ. అన్నదాతలకు రుణమాఫీ చేశాం.. ఇదే మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం..అని గవర్నర్ తెలిపారు.
దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి ఉత్పత్తి అవుతోందని, వరి రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామని ఇప్పటి వరకు రూ.1,206 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయణించేందుకు వెసులుబాటు కల్పించామని అన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో యవతలో నైపుణ్యాన్ని పెంచుతున్నామని అన్నారు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. నిరుపేదలను అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని తెలిపారు. TGPSCని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.
23.35 లక్షల మంది కర్షకులకు ప్రయోజనం కల్పించాం. రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేల చొప్పున వారికి అందిస్తున్నాం. రైతు నేస్తం అమలు చేస్తున్నాం. వరి పంటకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నాం. అన్నదాతల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాం. మహాలక్ష్మి పథకం గేమ్ ఛేంజర్‌గా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం” అని గవర్నర్ అన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ గురువారానికి వాయిదా పడింది.