త్వరలో ఆ మూడు జిల్లాల్లో కొత్త‌ వెటర్నరీ కళాశాలలు

Telangana Government will set up three new veterinary colleges in those three districts. మంగళవారం రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో

By Medi Samrat  Published on  29 Nov 2022 2:45 PM GMT
త్వరలో ఆ మూడు జిల్లాల్లో కొత్త‌ వెటర్నరీ కళాశాలలు

మంగళవారం రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో ఆధునిక వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్‌ను పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో వెటర్నరీ డాక్టర్ల కొరతను తీర్చేందుకు సిద్దిపేట, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో త్వరలో మూడు కొత్త వెటర్నరీ కాలేజీలను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.

నూతనంగా నిర్మించిన వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్‌లో మెడిసిన్, గైనకాలజీ, డయాగ్నసిస్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అన్ని ఒకే భవనంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. త్వరలో ఎండోస్కోపీ, స్కానింగ్, బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల విద్యార్ధులను సైతం ఆకర్షించే విధంగా అత్యాధునిక పరికరాలతో కూడిన వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ‌ రాష్ట్రం ఏర్పడిన 5 నెలల్లోనే పీవీ నరసింహారావు పేరుతో వెటర్నరీ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ యూనివర్సిటీలో అనేకమంది పశువైద్యులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

పశువైద్యుల కొరతను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో సిద్ధిపేట, నిజామాబాద్, నల్లగొండ తదితర ప్రాంతాలలో నూతనంగా వెటర్నరీ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి విద్యావంతులుగా అభివృద్ధి సాధించాలని పశువైద్య విద్యనూ అభ్యసిస్తున్న విద్యార్ధులకు మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించిందని చెప్పారు. జీవాలకు అందించే వైద్య సేవలలో గణనీయమైన మార్పులు తెలంగాణ రాష్ట్రంలోనే తీసుకొచ్చినట్లు తెలిపారు.


Next Story