తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. పేదలు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భద్రాచలం వేదికగా సీఎం రేవంత్ నేడు ప్రారంభించనున్నారు. దశల వారీగా అర్హులకు ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి రూ.3 వేల కోట్లు మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతలో అర్హులకు 95,235 ఇళ్లు మంజూరు చేయనుంది.
నేడు భద్రాచలంలో ప్రారంభించే ఇందిరమ్మ ఇల్లు పథకంపై ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది.. ఈ పథకం కింద తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికే రూ.5 లక్షలు ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ఏడాది 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తామని, ఆయా ఇళ్లను మహిళల పేరు మీదే ఇస్తామన్నారు. పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని చెప్పారు.