కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.725 కోట్లకు అప్రూవల్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి.

By Srikanth Gundamalla
Published on : 19 May 2024 6:54 AM IST

vtelangana, government, kalyana lakshmi, cm revanth reddy,

కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.725 కోట్లకు అప్రూవల్ 

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. కానీ.. ఇంకా ఎలక్షన్ కోడ్‌ మాత్రం అమల్లోని ఉంటుంది. వచ్చే నెల నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు ఉన్న సందర్భంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే.. ఎన్నికల ముగిసిన వెంటనే రేవంత్‌ ప్రభుత్వం పథకాల అమలుపై ఫోకస్‌ పెడుతోంది. ఫలితాలు వెల్లడి అయిన తర్వాత ఎన్నికల కోడ్ ఎత్తేసిన వెంటనే వివిధ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అధికారుల ద్వారా ప్రణాళికలను సిద్ధం చేసింది. నిధులను కూడా సమకూరుస్తోంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల్లో భాగమైన ముఖ్యమైన పథకం కల్యాణ లక్ష్మి. దీన్ని తాము చెప్పినట్లుగానే రూ.లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేశారు అధికారులు. అంతేకాదు.. దీన్ని ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అమలు చేసేందుకు నిధులను కూడా మంజూరు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.725 కోట్లకు తెలంగాణ ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే కాంగ్రెస్‌ పార్టీ ముందు చెప్పినట్లుగా లక్ష రూపాయలతో పాటు.. తులం బంగారం అందించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. కల్యాణ లక్ష్మి పథకం అమలు కోసం రాష్ట్రంలో చాలా మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. కొందరు అయితే.. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకుని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ పథకంపై అధికార పార్టీపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దాంతో.. సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకుని కచ్చితంగా తాము చెప్పినట్లుగానే రూ.లక్షతో పాటుగా తులం బంగారం అందించేలా ప్రణాళికలను సిద్దం చేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story