ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణమాఫీ!
తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
By అంజి Published on 16 Feb 2024 6:53 AM ISTఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ!
తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒకటైన రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రుణమాఫీపై చాలా మంది రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రైతు రుణమాఫీపై కీలక కామెంట్స్ చేశారు. రైతు రుణమాఫీకి సంబంధించి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు శాసనసభ వేదికగా ప్రకటించారు . దీనికి సంబంధించి అధికారులు విధివిధానాలు ఖరారు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే హామీలు అమలు చేస్తామన్నారు.
తాజాగా.. ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి కూడా రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనిలో భాగంగా రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రాగానే కార్యారూపం దాల్చుతుందని పేర్కొన్నారు. అలాగే ధాన్యానికి మద్ధతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు బోనస్ రూ.500 ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర రూ.2060 కాగా.. కొనుగోలు కేంద్రాల్లో రూ.2600 ధర పలుకుతోందని తెలిపారు.
నూతన విత్తన విధానం
ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క వెల్లడించారు. నాసిరకం విత్తనాలను, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని.. నకిలీ విత్తనాలను విక్రయించే వ్యాపారులను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. నాణ్యమైన విత్తన ఉత్పత్తితో పురోభివృద్ధి కోసం త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకువస్తామని ప్రకటించారు. ఈ ఏడాది ఆయిల్ పాం సాగు విస్తరణను అదనంగా లక్ష ఎకరాలు పెంచడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.