హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో మార్నింగ్ సమయంలో చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ అందించే పథకాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే చిన్నారుల ఆరోగ్యం కోసం మధ్యాహ్న భోజనం, గుడ్లు, బాలమృతం వంటి అందిస్తోంది. దీంతో పాటు టీజీ ఫుడ్స్ ద్వారా కిచిడీ, ఉప్మా వంటి టిఫిన్స్‌ను పిల్లలకు అందించనుంది. ఒక్కో రోజు ఒక్కో టిఫిన్ ఉండనుంది.
తొలుత హైదరాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల పరిధిలో ఉన్న 970 కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత లోటుపాట్లను సరిదిద్ది రాష్ట్ర వ్యాప్తంగా 35,781 కేంద్రాల్లో అమలు చేయనున్నట్టు సమాచారం. దీంతో 8 లక్షల మంది చిన్నారులకు ఈ స్కీమ్ లాభాలు అందనున్నాయి. ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించాలనుకుంది.
మేడారం జాతర ఏర్పాట్లలో ప్రభుత్వం పూర్తిగా నిమగ్నం కావడంతో వచ్చే నెల నుంచి ఈ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేయాలని భావిస్తున్నారు. క్వాలిటీలో రాజీలేకుండా టిఫిన్స్ అందించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ముందుగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ పరిధిలోని 970 అంగన్‌వాడీ కేంద్రాలను ఎంపిక చేశారు. ఈ కేంద్రాల్లోని 15 వేల మంది చిన్నారులకు ప్రతి రోజూ అల్పాహారం రూపంలో పౌష్ఠికాహారం అందిస్తారు.