ఫైళ్ల మాయంపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
నాంపల్లి పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 16 Jan 2024 3:58 PM ISTనాంపల్లి పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపకానికి సంబంధించి అక్రమాలకు సంబంధించి పశుసంవర్ధక శాఖపై ఓ కేసు, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపై మరో కేసు నమోదయ్యాయి. ఈ కేసులను ఇప్పుడు ఏసీబీకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గొర్రెల పంపిణీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అధికారులపై గతంలో ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి గచ్చిబౌలిలో కేసు నమోదయింది. గొర్రెల పంపిణీలో అక్రమాలపై ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. గొర్రెల పంపిణీపై ఏడుకొండలు అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 26న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఓ చోట 133 గొర్రెల యూనిట్లను పంపిణీ చేయగా 18 మంది రైతులకు పశుసంవర్ధక శాఖ చెల్లింపులు జరపలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులు బినామీ అకౌంట్ నెంబర్లకు నగదు బదిలీ చేశారని కూడా ఆరోపణలు రావడంతో 406, 409, 420 ఐపీసీ సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.
పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్లు అప్పట్లో వార్తలు రాగా.. సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ OSD కళ్యాణ్ కుమార్ ఖండించారు. కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చిన తర్వాత కార్యాలయాన్ని మార్చామని కళ్యాణ్ తెలిపారు. ప్రభుత్వ మార్పిడి ఫర్నిచర్, ఇతర సామగ్రిని సెక్యూరిటీకి అప్పగించే ప్రక్రియలో భాగంగానే మాసాబ్ ట్యాంక్ కార్యాలయానికి తన సిబ్బందితో వెళ్లినట్లు స్పష్టం చేశారు. శాఖాపరమైన ఫైళ్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ కార్యాలయంలలోనే ఉంటాయని కళ్యాణ్ వివరించారు.