పంట నష్టపోయిన రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు!
గత నెలలో వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి
పంట నష్టపోయిన రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు!
గత నెలలో వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టం లెక్కలను వ్యవసాయ శాఖ తేల్చింది. మొత్తం 10 జిల్లాల్లో 15,246 మంది రైతులకు చెందిన 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు నిర్ధారించారు.
కాగా నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 10వేల చొప్పున పరిహారం అందిస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.15.81 కోట్లు చెల్లించనుంది. రైతులకు పరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికల సంఘం అనుమతితో త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
గత నెలలో కురిసిన వడగళ్ల వానల వల్ల జరిగిన పంటనష్టానికి సంబంధించి సర్వే పూర్తయిందని.. ఎన్నికల సంఘం అనుమతి రాగానే ప్రభుత్వం పంట నష్టపరిహారం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఏ ఒక్కరైతు ప్రకృతి విపత్తులతో పంట నష్టపోకూడదని పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. దీని కోసం అధికారులు పంపిన ప్రతిపాదనలను పరిశీలించి, ఎన్నికల సంఘం అనుమతితో వచ్చే వానాకాలం సీజన్‌లోనే బీమా పథకం అమలుకు టెండర్ల ప్రక్రియ చేపడతామన్నారు. త్వరలో రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తామని, అప్పటి వరకు బ్యాంకులు, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు పంటరుణాల వసూళ్ల పేరిట రైతులను ఇబ్బందులు పెట్టవద్దని కోరారు.