కొత్త రేషన్‌కార్డుదారులకు శుభవార్త..ఆ పథకాలకు అప్లయ్ చేసుకునే ఛాన్స్
రాష్ట్రంలో నూతనంగా రేషన్ కార్డులు పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik
కొత్త రేషన్‌కార్డుదారులకు శుభవార్త..ఆ పథకాలకు అప్లయ్ చేసుకునే ఛాన్స్
రాష్ట్రంలో నూతనంగా రేషన్ కార్డులు పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త రేషన్‌కార్డులు పొందిన వారికి ఉచిత విద్యుత్తు, రాయితీపై గ్యాస్ సిలిండర్ తదితర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తించనున్నాయి. పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించింది. 10 ఏళ్లుగా రేషన్‌కార్డులు మంజూరు కాకపోవడంతో గత, ప్రస్తుత ప్రభుత్వంలో పలు పథకాలకు చాలా మంది అర్హులు దూరమయ్యారు. ప్రస్తుతం వారికి రేషన్‌కార్డులు మంజూరు చేయడంతో లబ్ధిదారుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వీరితోపాటు గతంలో రేషన్ కార్డు కలిగి ఉండి పథకాలు పొందనివారు సైతం వాటికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు పురపాలక ఆఫీసులు, ఎంపీడీవో(మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్) కార్యాలయాల్లో స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.
గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మండల పరిషత్తు కార్యాలయాల్లో(ఎంపీడీవో ఆఫీస్), పట్టణాల్లోని లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయాల్లో సంప్రదించాల్సి ఉంటుంది. రాయితీ గ్యాస్ కోసం లబ్ధిదారులు తమ ఆధార్‌కార్డు, తెల్లరేషన్ కార్డు జిరాక్స్‌లతో పాటు గ్యాస్ కనెక్షన్ ధ్రువీకరణ పత్రాలు కౌంటర్లతో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు సంఖ్యను ప్రజా పరిపాలనలో కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే వారు పథకాలకు అర్హత పొందుతారు. కాగా ప్రస్తుతం వెబ్‌సైట్‌లో రాయితీ వంటగ్యాస్ ఆప్షన్ ఓపెన్ కావడంలేదని గృహజ్యోతి పథకం ఆప్షన్ మాత్రమే సెలక్ట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.