Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఎలక్ట్రిక్ వాహనం కొంటే డిస్కౌంట్
తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది
By - Knakam Karthik |
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఎలక్ట్రిక్ వాహనం కొంటే డిస్కౌంట్
తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల కొనుగోలుపై ప్రత్యేక రాయితీలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈవీ పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని తయారీ కంపెనీలను ప్రభుత్వం కోరిందన్నారు. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా భారీ ఊరటనిచ్చే అంశమని చెప్పారు. కేవలం ఉద్యోగులకే కాకుండా, ప్రభుత్వ విభాగాల్లో కూడా 25 నుంచి 50 శాతం వరకు ఈవీ వాహనాలనే వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఇదే నిబంధనను ఎంఎన్సీ కంపెనీలు, ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తింపజేసేలా 'నిర్బంధ విధానం' తీసుకువచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.
ప్రజా రవాణాలో కాలుష్యాన్ని తగ్గించేందుకు 'పీఎం ఈ-డ్రైవ్' పధకం కింద ప్రస్తుతం 376 ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా... త్వరలోనే కొత్తగా 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. వీటితో పాటు వరంగల్ మున్సిపాలిటీకి 1010, నిజామాబాద్‌కు 50 బస్సులు కేంద్ర పథకం ద్వారా రానున్నాయన్నారు. రాష్ట్రంలో కొత్త ఈవీ పాలసీ అమలులోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపు లక్ష వాహనాలు అమ్ముడుపోవడం విశేషమని తెలిపారు. వాహనదారుల సౌకర్యార్ధం ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈవీ వాహనాలపై ఇస్తున్న రాయితీల వల్ల ప్రభుత్వానికీ సుమారు రూ. 900 కోట్ల వస్ను ఆదాయం తగ్గినప్పటికీ.. భవిష్యత్తు తరాల కోసం ఈ పాలసీని సకర్బందీగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసిందని, కాలుష్య నియంత్రణలో భాగంగా 15 ఏళ్లు దాటిన పాత వాహనాలను తొలగించేందుకు స్క్రాప్ పాలసీ'కి ప్రభుత్వం జీవో విడుదల నేసిందన్నారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు పాత పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ట్రో ఫిట్టింగ్' ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారని, ప్రజల్లో అవగాహన కల్పించెందుకు ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో ఈవీ వాహనాలను వాడాలని మంత్రి కోరారు.