Telangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్..త్వరలో సర్కార్ ల్యాప్‌టాప్‌లు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుటోంది.
By Srikanth Gundamalla Published on 4 July 2024 9:00 AM ISTTelangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్..త్వరలో సర్కార్ ల్యాప్‌టాప్‌లు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుటోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే ఐదింటిని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆరు గ్యారెంటీలు మాత్రమే కాదు.. తదితర పథకాల అమలు విషయంలోనే తెలంగాణ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే మరికొన్ని పథకాలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే మూతపడ్డ స్కూళ్లను తెరిపిస్తామని చెప్పారు. ప్రతి పల్లె, తండాకు ఓ బడి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు.
ప్రస్తుతం నడుస్తోన్న స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్వాడ్‌జెన్ అనే ప్రముఖ సంస్థతో కలిసి తెలంగాణలోని ప్రతి పాఠశాలకు ఇంటరాక్టీవ్ వైట్ బోర్డు(ఐడబ్ల్యూబీ), విద్యార్థులకు 20 వేల లోపు ల్యాప్‌టాప్‌లను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలో 5 జీ మొబైల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు కూడా చేపట్టారు. ప్రతి పేద విద్యార్థికి ఉన్నతమైన విద్యనందించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
మరోవైపు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. సమీకృత రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అమలు చేయటంలో వచ్చే ఆచరణాత్మక సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు వివిధ శాఖల అధికారులు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు. విశాలమైన ప్రాంగణంలో ఒకే చోట ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్వహించడంలో ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభుత్వం ఎంపిక చేసుకుంది.